ప్రతి క్షణం
ప్రజల పక్షం

  బూడిద వాగు వంతెన రోడ్డు ఆదమరిస్తే అంతే సంగతులు

అధికారుల నిర్లక్ష్యంపై వాహనదారుల ఆవేదన
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని బూడిద వాగు వంతెన ఇప్పుడు ప్రమాదాలకు నిలయంగా మారుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు వంతెన తీవ్రంగా దెబ్బతింది. అయినా సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడం గమనార్హం.
ఈ వంతెన ప్రధాన రహదారిపై ఉండటంతో ప్రతి రోజూ వందలాది వాహనాలు ఇక్కడి మీదుగా సాగుతాయి. వర్షాలు వచ్చినప్పుడు వంతెనపై నీటి ప్రవాహం పెరిగి, మరింత ప్రమాదకరంగా మారుతోంది. పలు ప్రాంతాల ప్రజలు ఉద్యోగాలకు, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు ఈ వంతెన ఆధారపడుతున్నారు.
దీంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. “ఒక్కసారి వాహనం జారిపోతే ప్రాణాలే పోతాయేమోనని భయం వేస్తోంది. ప్రతిరోజూ ఇదే భయంతో ప్రయాణిస్తున్నాం. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు,” అని ఒక వాహనదారు వాపోయారు.
ప్రజా భద్రత దృష్ట్యా సంబంధిత శాఖలు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వంతెనను సకాలంలో మరమ్మతులు చేయకపోతే, ఎప్పుడైనా దుర్ఘటనలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
సంబంధిత అధికారుల స్పందన ఇంకా రానివేళ, ప్రజలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే వంతెనలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!