భూభారతి చట్టంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది: కలెక్టర్ జితేష్ వి పాటిల్. కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం భూసంబంధిత సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూపొందించబడిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. శుక్రవారం కరకగూడెం మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆర్డీవో దామోదర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూభారతి ద్వారా సంవత్సరాలుగా కొనసాగుతున్న భూ వివాదాలను పరిష్కరించే అవకాశముందని తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ 17 నుండి 30 వరకు గ్రామస్థాయిలో భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో ధరణి పోర్టల్‌లో జరిగిన తప్పిదాల కారణంగా నష్టపోయిన రైతులు భూభారతి చట్టం ద్వారా న్యాయం కోసం అప్పీల్ చేసుకునే అవకాశముందని వివరించారు. ఈ చట్టం ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటోందని అన్నారు.
ఈ సందర్భంగా అనంతారం గ్రామానికి చెందిన రైతు శ్రీరామ్ చంద్రయ్య తన సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తనకు చెందిన మూడెకరాల భూమిపై సర్వే నెంబర్ 1,2లో ఉన్న పట్టాను, అదే సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి ఉందన్న కారణంతో అప్పటి వీఆర్వో రద్దు చేశారని వాపోయారు. సమస్యపై తహసీల్దార్ కార్యాలయం చుట్టూ అనేకసార్లు తిరిగినప్పటికీ పరిష్కారం దొరకలేదని తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్, తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
సదస్సులో తహసీల్దార్ నాగ పసాద్, ఇన్చార్జ్ ఎంపీడీవో కుమార్, ఏడీవో తాతారావు తదితర అధికారులు, రైతులు పాల్గొన్నారు.









