సమస్య ఎక్కడో… పరిష్కారం అక్కడే!
బతుకమ్మ వేడుకలకు రహదారి సమస్యకు పరిష్కారం
ఎంపీవో వెంకటేశ్వరరావు చొరవతో పొట్లపల్లి గ్రామస్తులకు ఊరట
హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు
ఆధాబ్ న్యూస్ , పినపాక :
ప్రజలకు ఎదురయ్యే సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్న పినపాక ఎంపీవో వెంకటేశ్వరరావు మరోసారి చొరవ చూపారు. మండలంలోని పొట్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బతుకమ్మ వేడుకల సందర్భంగా రహదారి సమస్య తలెత్తగా, విషయాన్ని తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
బతుకమ్మ పండుగ నేపథ్యంలో గ్రామంలోని మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. అయితే వేడుకలు నిర్వహించే ప్రాంతానికి వెళ్లే రహదారి సౌకర్యం సరిగా లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో ఎంపీవో వెంకటేశ్వరరావు స్పందించారు.
సమస్య ఉన్న ప్రాంతాన్ని పరిశీలించిన ఎంపీవో సంబంధిత సిబ్బందితో మాట్లాడి రహదారి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో బతుకమ్మ వేడుకలకు హాజరయ్యే మహిళలు, గ్రామస్తులకు రాకపోకలు సులభతరమయ్యాయి.
పండుగ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా స్పందించి సమస్యను పరిష్కరించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సకాలంలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్న ఎంపీవో వెంకటేశ్వరరావును గ్రామస్తులు అభినందించారు. రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు తదితర ప్రజా అవసరాలపై అధికారులు స్పందిస్తే గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని వారు తెలిపారు.









