అశ్వాపురం పాడులో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
చట్టాన్ని గౌరవిస్తూ ప్రశాంతంగా జీవించాలి: మణుగూరు డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు, మణుగూరు డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి సారథ్యంలో కరకగూడెం పోలీసులు అశ్వాపురం పాడు గ్రామంలో సోమవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులతో డీఎస్పీ రవీందర్ రెడ్డి సమావేశమై, అశ్వాపురం పాడు గ్రామంలో గత ఏడాది కాలంగా చోటుచేసుకున్న వరుస సంఘటనలను ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవిస్తూ, చట్టానికి లోబడి జీవించాలని సూచించారు. ఎవరూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, చట్టాన్ని అతిక్రమించే చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసులు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తిత్వం, క్రమశిక్షణతో మెలుగుతూ గ్రామంలో ప్రశాంత వాతావరణానికి సహకరించాలని కోరారు.
అనంతరం గ్రామంలోని సుమారు 50 మంది చిన్నారులకు దుస్తులను పంపిణీ చేశారు. చిన్నారులతో పోలీసులు ఆప్యాయంగా మెలిసి, వారికి దుస్తులు అందజేశారు.
కార్యక్రమంలో ఎడూళ్ల బయ్యారం సీఐ ఈ. వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్ఐ పి.వి.ఎన్. రావు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.









