గోదావరి వద్ద వినాయక నిమజ్జనాల పరిశీలన
గోదావరి పెరుగుదలపై అధికారుల అప్రమత్తత
భద్రాచలం, సెప్టెంబర్ 24 (ఆధాబ్ న్యూస్): భద్రాచలం వద్ద గోదావరి నదిలో కొనసాగుతున్న వినాయక నిమజ్జన కార్యక్రమాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, డీఎస్పీ అరుణ్ కుమార్ పరిశీలించారు. అదే సమయంలో గోదావరి నీటిమట్టం పెరుగుతున్న పరిస్థితిని కూడా అధికారులు పరిశీలించి, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తీసుకుంటున్న భద్రతా చర్యలను సమీక్షించారు.
వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం గోదావరి వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నదీ పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా సిబ్బందికి సూచనలు చేశారు.
గోదావరి నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో నదిలోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు ప్రజలకు సూచించారు. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, డీఎస్పీ అరుణ్ కుమార్ వెంట పోలీసు అధికారులు, సిబ్బంది నిమజ్జన ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.









