భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
వాగులు, వంకలు దాటొద్దు.. విద్యుత్ వైర్లకు దూరంగా ఉండండి
కరకగూడెం ఎస్సై పి.వి.ఎన్. రావు సూచన
కరకగూడెం, సెప్టెంబర్ 23 (ఆధాబ్ న్యూస్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరకగూడెం ఎస్సై పి.వి.ఎన్. రావు సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో రైతులు, యువకులు, ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు నీటి గుంటలు, చెరువులు, వాగుల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
వర్షాల సమయంలో వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించవద్దని ఎస్సై హెచ్చరించారు. రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు అవతలి వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
అదేవిధంగా విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. తెగిపడిన వైర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని, వాటి సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని, వర్షాల కారణంగా ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా సురక్షితంగా ఉండాలని ఎస్సై పి.వి.ఎన్. రావు కోరారు.









