బిగ్ బ్రేకింగ్ న్యూస్
సుప్రీంకోర్టులోనూ దానం నాగేందర్‌కు చుక్కెదురు
హైకోర్టు అనర్హత తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24 (ఆధాబ్ న్యూస్): ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పు కొనసాగనుంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఈ వ్యవహారంపై దాఖలైన అనర్హత పిటిషన్లను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు ఆయనను అనర్హుడిగా ప్రకటించి ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్‌మాల్య బాగ్చి, వి. మోహనా నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తీర్పుతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా కొనసాగనుంది. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానం నాగేందర్ అనర్హతపై సుప్రీంకోర్టు నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.









