వర్షం పడితే అంతే సంగతులు
రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గాంధీనగర్ వాసులు
వెంటనే రహదారి నిర్మాణ పనులు చేపట్టాలి
బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్
కరకగూడెం ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలంలోని తాటిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గాంధీనగర్‌కు వెంటనే రహదారి నిర్మించాలని బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు.
గాంధీనగర్‌కు సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాకాలంలో గ్రామానికి వెళ్లాలంటే రహదారి అధ్వానంగా మారి పూర్తిగా బురదమయంగా మారడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్నారు.
వర్షకాలంలో ఆ రోడ్డు వరి నాటు వేయడానికి కూడా ఉపయోగపడుతుందన్నారు.గాంధీనగర్ రోడ్డు ప్రధాన రహదారి వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేరకు రహదారి సక్రమంగా లేకపోవడంతో గ్రామస్తులు నిత్యం అవస్థలు పడుతున్నారని ఆరోపించారు.
వర్షాలు కురిసిన సమయంలో రహదారి పూర్తిగా చిత్తడిగా మారడంతో ద్విచక్ర వాహనాలు,ఆటోలు, ఇతర వాహనాలు గ్రామానికి చేరుకోవడం కష్టంగా మారుతోందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు గ్రామానికి చేరుకోలేని పరిస్థితి ఉండటం ఆందోళనకరమని రంజిత్ కుమార్ పేర్కొన్నారు.
గర్భిణులు,వృద్ధులు, చిన్నారులు,విద్యార్థులు
అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లేందుకు కూడా రవాణా సౌకర్యం సక్రమంగా అందుబాటులో లేకపోవడం బాధాకరమన్నారు.
108 అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలు సైతం గ్రామంలోకి సులభంగా చేరుకోలేని పరిస్థితి ఉందన్నారు.పాముకాటు, తేలు కాటు వంటి ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
గాంధీనగర్‌కు పక్కా రహదారి నిర్మించాలని గ్రామస్తులు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి,ఎన్నిసార్లు వినతులు ఇచ్చిన పట్టించుకోలేదని రంజిత్ కుమార్ పేర్కొన్నారు.
ఏళ్లుగా ప్రజలు రహదారి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం సరికాదన్నారు.
తాత్కాలికంగా మట్టి పోసి రహదారిని బాగుచేసినట్లు కాకుండా, నాణ్యతతో కూడిన శాశ్వత పక్కా రహదారిని నిర్మించాలని రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు.అన్ని కాలాల్లో వాహనాలు రాకపోకలు సాగించే విధంగా రహదారిని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజల ప్రాణాలు, విద్య, వైద్యం, రవాణా వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత అధికారులు గాంధీనగర్‌ను సందర్శించి రహదారి పరిస్థితిని పరిశీలించి,వెంటనే రహదారి నిర్మాణ పనులు ప్రారంభించాలని రంజిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గాంధీనగర్ ప్రజల సమస్యను పరిష్కరించాలని, నిధులు కేటాయించి మంచి రహదారి నిర్మించాలని ఆయన కోరారు.









