వినాయక మండపాల వద్ద భద్రతా జాగ్రత్తలు పాటించాలి
భక్తి ఉత్సాహంలో భద్రతను విస్మరించొద్దు.. అప్రమత్తంగా ఉండాలి
ఆధాబ్ న్యూస్ ,డెస్క్ : వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు, భక్తులు తప్పనిసరిగా భద్రతా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. భక్తి, ఉత్సాహంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
విద్యుత్ విషయంలో అప్రమత్తత అవసరం: మండపాల్లో లైటింగ్, సీరియల్ బల్బులు, సౌండ్ సిస్టమ్ కోసం నాణ్యమైన వైరింగ్‌ను మాత్రమే వినియోగించాలి. విద్యుత్ వైర్లు బయటకు వేలాడకుండా, నీరు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ ఓవర్‌లోడ్ కనెక్షన్లకు దూరంగా ఉండాలి.
అగ్ని ప్రమాదాలపై జాగ్రత్త: కర్పూరం, దీపాలు, అగరబత్తులు వెలిగించే ప్రాంతాల్లో మండే వస్తువులను ఉంచకూడదు. వీలైనంత వరకు మండపం వద్ద ఫైర్ ఎక్స్టింగ్విషర్ అందుబాటులో ఉంచుకోవాలి. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే స్పందించేలా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి.
రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు: గణేష్ మండపాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున క్యూలు క్రమబద్ధంగా ఉండేలా వాలంటీర్లను ఏర్పాటు చేయాలి. తోపులాటకు అవకాశం లేకుండా భక్తులు కూడా నిర్వాహకులకు సహకరించాలి.
సౌండ్ సిస్టమ్ బాధ్యతగా వినియోగించాలి: ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిబంధనలు, నిర్ణీత సమయాలను పాటిస్తూ సౌండ్ సిస్టమ్, స్పీకర్లను వినియోగించాలి. అధిక శబ్దంతో ఇతరులకు ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి.
వర్షాలపై ముందస్తు జాగ్రత్తలు: వర్షం పడే అవకాశం ఉన్నందున మండపం పైకప్పు పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి. విద్యుత్ కనెక్షన్లు, జనరేటర్ తదితరాలను నీటికి దూరంగా, సురక్షిత ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. వర్షం సమయంలో విద్యుత్ తీగలు, పరికరాలను తాకకుండా భక్తులు అప్రమత్తంగా ఉండాలి.
“భక్తి ఎంత ముఖ్యమో.. భద్రత కూడా అంతే ముఖ్యం. ప్రతి గణేష్ మండపం వద్ద ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలి” అని నిర్వాహకులు, భక్తులకు సూచిస్తున్నారు.









