ఏచూరి ఒక స్మరణ కాదు.. ఆశయాల కొనసాగింపు
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలి: తమ్మినేని వీరభద్రం
ఆధాబ్ న్యూస్ – ఖమ్మం: కామ్రేడ్ సీతారాం ఏచూరి ఒక స్మరణ మాత్రమే కాదని, ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్యవాదం, ఆర్థిక న్యాయం కోసం ఏచూరి చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు.
సీతారాం ఏచూరి రెండో వర్థంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిన ప్రతిసారీ ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించిన గొంతు ఏచూరిదేనన్నారు. లౌకికవాదంపై దాడులు జరిగినప్పుడు వాటిని తీవ్రంగా ప్రతిఘటించారని, కార్మికులు, రైతులు, పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడారని తెలిపారు.
మార్క్సిజాన్ని కేవలం అధ్యయనం చేయకుండా, ఆ సిద్ధాంతాన్ని ప్రజా జీవితంలో ఆచరణలో పెట్టిన దార్శనికుడు ఏచూరి అని కొనియాడారు. జేఎన్‌యూలో విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఆయన, విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా రెండుసార్లు ఎన్నికై అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు. పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, సూర్జిత్ తదితర నాయకుల మార్గదర్శకత్వంలో మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతాలను లోతుగా అధ్యయనం చేసి, పార్టీ సిద్ధాంతవేత్తగా ఎదిగారని తెలిపారు.
1992లో మద్రాస్‌లో జరిగిన సీపీఐ(ఎం) 14వ పార్టీ మహాసభల్లో సోవియట్ సోషలిస్టు శిబిరం విచ్ఛిన్నానికి గల కారణాలను సైద్ధాంతికంగా విశ్లేషించి, మార్క్సిజం సమకాలీనతను సమర్థిస్తూ ఏచూరి కీలక పాత్ర పోషించారని తమ్మినేని అన్నారు. అనంతరం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, 2015లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి కమ్యూనిస్టు ఉద్యమానికి విశేష సేవలందించారని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్యవాదం, ఆర్థిక న్యాయం భారత రాజ్యాంగానికి ప్రాథమిక స్తంభాలని ఏచూరి బలంగా విశ్వసించారని తమ్మినేని తెలిపారు. ఈ నాలుగింటిలో ఏ ఒక్కదాన్ని బలహీనపరిచినా ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించేవారని చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని కేవలం ఎన్నికల ప్రక్రియగా ఏచూరి చూడలేదని, ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సామాజిక-ఆర్థిక సమానత్వం ఉండాలని ఆయన కోరుకున్నారని తెలిపారు. రాజకీయ సమానత్వంతో పాటు ఆర్థిక, సామాజిక సమానత్వం సాధించినప్పుడే ప్రజాస్వామ్యం సార్థకమవుతుందని ఆయన బలంగా వాదించేవారని అన్నారు.
కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, యువత, మహిళలు, పేదల హక్కుల కోసం పోరాడటం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భాగమని ఏచూరి భావించేవారని తమ్మినేని పేర్కొన్నారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం వంటి మౌలిక హక్కులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన నిరంతరం పోరాడారని తెలిపారు.
2004లో యూపీఏ-1 ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కనీస ఉమ్మడి కార్యక్రమం రూపకల్పనలో ఏచూరి కీలక పాత్ర పోషించారని తమ్మినేని గుర్తుచేశారు. వామపక్షాల ఒత్తిడితో ఆ కాలంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టం, విద్యాహక్కు చట్టం వంటి అనేక ప్రజానుకూల చర్యలు అమల్లోకి వచ్చాయని తెలిపారు.
2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఏచూరి ప్రజా సమస్యలను పార్లమెంట్లో బలంగా వినిపించారని అన్నారు. ఆయన ప్రసంగాలు ఆధారాలతో కూడిన విశ్లేషణ, పదునైన విమర్శలు, లోతైన సిద్ధాంత అవగాహనతో ఉండేవని పేర్కొన్నారు. అధికార పక్షంలో ఉన్నప్పటికీ నిర్మాణాత్మక విమర్శలు చేయడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం ఆయన ప్రత్యేకతగా తమ్మినేని వివరించారు.
దేశంలో మతోన్మాద శక్తుల ఎదుగుదలను ఎదుర్కొనేందుకు లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత అవసరమని ఏచూరి చివరి వరకు కృషి చేశారని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
“ఏచూరి మరణించి రెండేళ్లు గడిచినా ఆయన ఆలోచనలు, ఆశయాలు నేటికీ ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తినిస్తున్నాయి. ఆయన హెచ్చరించిన ముప్పులు మరింత తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఏచూరిని స్మరించుకోవడం అంటే కేవలం ఆయనను గుర్తు చేసుకోవడం కాదు. ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసి, లౌకిక ప్రజాస్వామ్య భారతదేశ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడటమే ఆయనకు నిజమైన నివాళి” అని తమ్మినేని వీరభద్రం అన్నారు.









