భద్రాద్రి జిల్లా టూరిజం నోడల్ అధికారిణిగా అనూష
అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ అంకిత్ ఉత్తర్వులు
ఆధాబ్ న్యూస్ , భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూరిజం నోడల్ అధికారిణిగా జిల్లా పంచాయతీ అధికారిణి, గ్రూప్-1 అధికారి అనూషను నియమిస్తూ జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెకు టూరిజం నోడల్ అధికారిణిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో పర్యాటక రంగ అభివృద్ధిపై చర్చించిన నేపథ్యంలో జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అనూషకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను గుర్తించి, వాటి అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సూచించారు. అలాగే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందిస్తూ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి నోడల్ అధికారిణిగా సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
కాగా, ప్రస్తుతం టూరిజం అధికారిగా విధులు నిర్వహిస్తున్న పరాధామ రెడ్డి జిల్లా యువజన, క్రీడల అధికారిగా కొనసాగనున్నారు.









