సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కిన రూ.59,199.. పోలీసుల కృషితో తిరిగి ఖాతాలోకి
మహబూబాబాద్, ఆధాబ్ న్యూస్:
బ్యాంకు అధికారుల పేరుతో వచ్చిన ఫోన్ కాల్‌ను నమ్మి సైబర్ మోసానికి గురై కోల్పోయిన రూ.59,199 నగదు ఆరు నెలల తర్వాత బాధితుడి ఖాతాలోకి తిరిగి చేరింది. పోలీసుల చొరవతో నగదు రికవరీ కావడంతో బాధితుడికి ఊరట లభించింది.
కొత్తగూడ మండలానికి చెందిన గుగులోత్ స్వామికి ఆరు నెలల క్రితం బ్యాంకు అధికారులమంటూ ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. అతడి మాటలను నమ్మిన స్వామి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.59,199 నగదును కాజేశారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు వెంటనే కొత్తగూడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
బాధితుడికి ధైర్యం చెప్పిన కొత్తగూడ ఎస్సై రాజ్‌కుమార్, ఉన్నతాధికారుల సహకారంతో సైబర్ సెల్ ద్వారా నగదు రికవరీకి చర్యలు చేపట్టారు. నిరంతర ప్రయత్నాల అనంతరం సైబర్ నేరగాళ్లు కాజేసిన పూర్తి మొత్తమైన రూ.59,199 బాధితుడి బ్యాంకు ఖాతాలోకి తిరిగి జమ అయ్యేలా చేశారు.
కష్టపడి సంపాదించిన డబ్బు తిరిగి రావడంతో గుగులోత్ స్వామి ఆనందం వ్యక్తం చేస్తూ ఎస్సై రాజ్‌కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమయస్ఫూర్తితో స్పందించి సైబర్ నేరంలో పోయిన నగదును తిరిగి రప్పించిన ఎస్సై రాజ్‌కుమార్‌ను పలువురు అభినందించారు.
బ్యాంకు అధికారుల పేరుతో వచ్చే అపరిచిత ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, పిన్ తదితర సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని పోలీసులు సూచించారు.









