భార్యకు క్షమాపణ చెప్పి.. తిరిగిరాని లోకానికి
అప్పుల బాధతో సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య
మణుగూరు, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన సింగరేణి ఉద్యోగి కృష్ణచైతన్య (32) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన అమ్మమ్మ, తాతయ్య, బంధువుల వద్ద పెరిగి కష్టాలను అధిగమిస్తూ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం సింగరేణి సంస్థలో ఉన్నత ఉద్యోగం సాధించారు.
ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్న కృష్ణచైతన్యకు ఐదేళ్ల కుమారుడు, ఏడాది వయసున్న కుమార్తె ఉన్నారు. కుటుంబంతో సంతోషంగా సాగుతున్న జీవితంలో అప్పుల సమస్యలు తీవ్ర మనోవేదనకు గురిచేసినట్లు సమాచారం. ఈ క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పీవీనగర్ సమీపంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆత్మహత్యకు ముందు భార్యకు క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది. కుటుంబాన్ని ఆదుకునే వ్యక్తి అకాల మరణంతో భార్యాపిల్లలు దిక్కుతోచని స్థితిలో మిగిలారు. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి జీవితంలో స్థిరపడిన కృష్ణచైతన్య ఇలా తనువు చాలించడం కుటుంబ సభ్యులు, బంధువులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.









