సమాచార హక్కు చట్టం ప్రజల ప్రాథమిక హక్కు: రాష్ట్ర ప్రధాన కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
సమాచార హక్కు చట్టం (RTI) ప్రజల ప్రాథమిక హక్కు అని రాష్ట్ర ముఖ్య పౌర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సిన బాధ్యత అధికారులదని, ఆర్టీఐ చట్టం అధికారులను ప్రజలకు వారధిలా మార్చుతుందని పేర్కొన్నారు.
రాష్ట్ర కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, పి.వి. శ్రీనివాసరావు, దేశాల భూపాల్ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేశారు. వారిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ పూలమొక్కలతో స్వాగతించారు. అనంతరం ఐడీఓసీ కార్యాలయ ప్రాంగణంలో వనమహోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు.
ఆర్టీఐ చట్ట అమలు పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ సదస్సులో కమిషనర్లతో పాటు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కమిషనర్ అయోధ్య రెడ్డి మాట్లాడుతూ…
RTI చట్టం ప్రస్తుతం 136 దేశాల్లో అమల్లో ఉందని తెలిపారు.
భారత్ ప్రపంచంలో 8వ స్థానంలో ఉండగా, మొదటి స్థానంలోకి తీసుకెళ్లేలా కృషి చేస్తున్నామని చెప్పారు.
తెలంగాణలో ఈ చట్టాన్ని దేశంలో ఆదర్శంగా నిలిపేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.
గత 10 ఏళ్లలో కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో 18,000 కేసులు పెండింగ్‌గా ఉన్నాయని తెలిపారు. ఆగస్టులో ఈ కేసులను పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 11 జిల్లాల్లో పౌర సమాచార అధికారులకు చట్టంలోని సెక్షన్లపై శిక్షణ కల్పిస్తున్నామన్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ…
జిల్లాలో అన్ని శాఖల అధికారులకు RTI చట్టంపై అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులకు నిర్ణీత సమయంలో సమాధానం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ సదస్సులో అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పీ సీఈవో నాగలక్ష్మి, ఆర్డీవోలు మధు, దామోదర్, పౌరసమాచార అధికారులు పాల్గొన్నారు. కమిషనర్లను కలెక్టర్ శాలువాతో సత్కరించారు.









