పినపాకలో భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు – MLA పాయం వెంకటేశ్వర్లు
పినపాక,ఆధాబ్ న్యూస్: పినపాక నియోజకవర్గంలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ఎటువంటి ప్రమాదం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ శాఖలు ఒకే దిశగా పనిచేయాలని సూచించారు.
అశోక్‌నగర్, సురక్ష బస్టాండ్, శ్రీశ్రీ నగర్ వంటి లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మురుగు కాలువలు, డ్రైనేజీలు శుభ్రపరిచే పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రజలు 100, 108 నెంబర్లను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవాలని సూచించారు. విద్యుత్ పరికరాలు జాగ్రత్తగా వాడాలని, పిల్లలను ప్రవాహాల వద్దకు పంపొద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో ఈ విపత్తును ఎదుర్కొంటామని తెలిపారు.









