వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులపై జిల్లా కలెక్టర్ సమీక్ష
విష జ్వరాల నేపథ్యంలో సిబ్బందికి కీలక సూచనలు
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి జిల్లాలోని వివిధ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఫార్మాసిస్టులు, శానిటేషన్ సూపర్వైజర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇటీవల చోటుచేసుకుంటున్న భారీ వర్షాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున ఆసుపత్రి సిబ్బంది పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని సూచించారు. అన్ని రకాల మందులు, రీఏజెంట్లు, టెస్టింగ్ కిట్లు సరిపడా మోతాదులో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రుల సిబ్బంది విధుల్లో సమయపాలన పాటిస్తూ 24 గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే అవసరమైన మౌలిక వసతులు, ఆధునిక యంత్రాలు చాలా ఆసుపత్రులలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యం అందేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
సమీక్షలో పలువురు వైద్య సిబ్బంది ఇన్సులిన్, మలేరియా మందులు కొరత విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఈ విషయమై రాష్ట్ర స్థాయి అధికారులతో సంప్రదించి వెంటనే వాటిని అందుబాటులోకి తేవడంపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అదే విధంగా ఆసుపత్రుల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిశీలించి తగిన పరిష్కారాలకు నిధుల మంజూరు కోసం స్వయంగా కృషి చేస్తానని తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవిబాబు, వివిధ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఫార్మసిస్టులు, నర్సింగ్ సూపరింటెండెంట్లు, శానిటేషన్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.









