ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. రోడ్లపైకి నీరు చేరే పరిస్థితులు ఏర్పడొచ్చని హెచ్చరిస్తూ, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తప్పనిసరిగా బయటకు రావాల్సి వస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అదేవిధంగా అధికారులు, సిబ్బంది కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు.
ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడానికి వాగులు, చెరువులు, నదుల వద్దకు వెళ్లకూడదని, అలాంటి చర్యలు ప్రాణాలపై ముప్పుగా మారతాయని హెచ్చరించారు.
విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలు తక్షణమే జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాలు, తహసీల్దార్ లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లకు సంప్రదించాలని ఆయన కోరారు.
వర్షాల నేపథ్యంలో జిల్లా, డివిజన్ మరియు మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో రెవెన్యూ, పోలీసు, రోడ్లు, మున్సిపల్, పంచాయతీ శాఖలతో సమన్వయం చేసుకుని తక్షణమే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “ప్రస్తుతం పడుతున్న వర్షాల సమయంలో తీసుకునే జాగ్రత్తలు, రాబోయే గోదావరి వరదల సమయంలో ఉపయుక్తపడతాయి. అందువల్ల అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి” అని పేర్కొన్నారు.
ప్రమాదాలను నివారించడంలో అధికారులు చేపట్టే చర్యలకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ విజ్ఞప్తి చేశారు.









