చేపల బోన్‌లెస్ కట్ విధానంపై ప్రాక్టికల్ డెమో – ఆరోగ్యం, ఆదాయం రెండూ సాధ్యమన్న కలెక్టర్ జితేష్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం క్యాంప్ కార్యాలయంలో చేపల బోన్‌లెస్ కటింగ్ విధానం పై ప్రత్యక్ష ప్రాక్టికల్ డెమో ఇచ్చారు. స్థానిక మత్స్యకారులు, ఫిష్ వ్యాపారులు, SHG మహిళల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో, చేపలలోని ముళ్లు తీసి వాటిని సులభంగా తినదగిన విధంగా తయారు చేసే పద్ధతిని కలెక్టర్ వివరించారు.
చేపలను బోన్‌లెస్‌గా తయారు చేయడం ద్వారా వాటి మార్కెట్ విలువ పెరుగుతుంది. దీని ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే కాదు, ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు,” అని కలెక్టర్ అన్నారు.
చేపల బోన్‌లెస్ ముక్కలను ఉపయోగించి చికెన్ టిక్కా, ఫిష్ పకోడీ, ఫ్రైస్ వంటి వంటకాలను రూపొందించవచ్చని, ఇవి ప్రత్యేకమైన రుచి కలిగినవిగా ప్రజలకు ఆకర్షణీయంగా ఉంటాయని తెలిపారు. అలాగే చేపల తలలు, మిగిలిన భాగాలతో పోషక విలువ కలిగిన సూప్ తయారు చేయవచ్చని, అదే సమయంలో ఎరువుగా ఉపయోగించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావచ్చునని వివరించారు.
ఈ విధానం ద్వారా ముఖ్యంగా మత్స్యకారులు, ఆదివాసీ కుటుంబాలు, మరియు స్వయం సహాయక గ్రూప్ (SHG) మహిళలు తమ జీవనోపాధిని మెరుగుపరచుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణను జిల్లాలో విస్తృతంగా ప్రోత్సహించాలని, తద్వారా మరిన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.









