నాగా సీతారాములుకు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి: కూరాకుల నాగభూషణం డిమాండ్
సుజాతనగర్‌లో ఘనంగా జరిగిన సన్మాన కార్యక్రమం
సుజాతనగర్, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన నాగా సీతారాములను ఘనంగా సన్మానిస్తూ యాదవ సంఘ నాయకులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర యాదవ సంఘ అధ్యక్షుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం ఆధ్వర్యం వహించారు.
ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ, “పార్టీ కోసం నాగా సీతారాములు చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వడం ద్వారా యాదవ సామాజిక వర్గానికి గౌరవం లభిస్తుంది” అని పేర్కొన్నారు. ఆయనతో పాటు పలువురు నాయకులు సీతారాములుకు శాలువా కప్పి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు అల్లాడి నర్సింహారావు, మాజీ వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోషయ్య, ఖమ్మం జిల్లా యాదవ సంఘ ప్రముఖులు కోడి లింగయ్య, జడ మల్లేష్, చిత్తారు ఇందుమతి తదితరులు పాల్గొన్నారు









