జులై 9 సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి – సీఐటీయూ పిలుపు
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు కొమరం కాంతారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రంలో విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనం చట్టాన్ని అమలు చేయకపోవడంతో పాటు, ఎనిమిది గంటల పని వ్యవస్థను తొలగించి 12 నుండి 18 గంటలు పని చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చాయని ఆరోపించారు.
గ్రామ పంచాయతీ కార్మికులకు నెలవారీ వేతనాలు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికే రెండు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. తగినంత సిబ్బంది లేకపోవడంతో పారిశుద్ధ్య పరిస్థితులు దిగజారుతున్నాయని పేర్కొన్నారు.
వర్షాకాలం ప్రారంభానికి ముందే పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, జీవో నంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, గ్రీన్ అంబాసిడర్లుగా పనిచేసినవారికి పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సార్వత్రిక సమ్మెకు సంబంధించిన నోటీసును మరియు సమస్యలపై వినతిపత్రాన్ని మండల పంచాయతీ అధికారి మారుతికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల కార్మిక సంఘం అధ్యక్షుడు గుమ్మడవెల్లి కృష్ణ, ఉప్పలి సాంబశివరావు, ధనంజయ్, రమేష్, ప్రశాంత్, శ్రీను, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.









