ప్రమాదకరంగా మారిన సారపాక ప్రధాన సెంటర్
గుంటలను పూడ్చండి సార్… మీకు పుణ్యం కలుగుతుంది!
భద్రాచలం,ఆధాబ్ న్యూస్:
సారపాక గ్రామంలోని దుర్గాహోటల్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై నెల రోజుల క్రితమే గుర్తు తెలియని వ్యక్తులు తవ్విన గుంటలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
రోడ్లకు ఇరువైపులా ఉన్న దుకాణాల కారణంగా వాహనదారులకు ఆ గుంటలను తప్పించుకొని వెళ్లే మార్గం కనిపించకుండా పోతోంది. ద్విచక్ర వాహనాలపై కుటుంబ సభ్యులతో ప్రయాణించే వారు గుంటలపై నుంచి వెళ్లాల్సి రావడం వల్ల వాహనాలు స్కిడ్ అవడం, ప్రమాదాలు సంభవించే పరిస్థితి ఏర్పడింది.
స్థానికులు మేజర్ గ్రామపంచాయతీ అధికారులతో పాటు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కలగజేసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. లేకపోతే, కనీసం సిమెంట్ కట్టలు దానం చేసి, గోదావరి ఇసుకతో స్వచ్ఛందంగా ఈ గుంటలను పూడ్చే ప్రయత్నం చేయాలని వ్యాపారవేత్తలను వేడుకుంటున్నారు.
ఇక వర్షాలు పెరిగితే ఈ గుంటలు పెద్ద మడుగులుగా మారి వాహనదారులకు కనపడకుండా ప్రమాదానికి కారణమవుతాయని స్థానికులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే తీవ్ర ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది.









