స్థానిక ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన: ఈ నెలాఖరులోగా షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, జూన్ 16 ఆధాబ్ న్యూస్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
రేపు జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి, ఖచ్చితమైన ఎన్నికల తేదీలను వెల్లడిస్తామని మంత్రి తెలిపారు.
“మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తాం. అవి పూర్తయిన వెంటనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ జారీ చేస్తాం,” అని మంత్రి తెలిపారు.
ఈ నేపథ్యంలో స్థానిక నాయకులు తమ తమ గ్రామాల్లో సఖ్యతతో ఉండాలని సూచించారు. “ఎన్నికలకు రాగానే 15 రోజుల గడువే ఉంది. కనుక చిన్న చిన్న లోటుపాట్లను సరిదిద్దుకుంటూ సిద్ధంగా ఉండాలి” అని సూచించారు.
అభ్యర్థుల ఎంపిక విషయంలో రిజర్వేషన్ల ఆధారంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న వారినే పార్టీ తరపున రంగంలోకి దింపుతామని మంత్రి వెల్లడించారు.
రైతులకు భరోసా
రాబోయే వారం రోజులలో అర్హులైన రైతులకు కుంట, రైతు భరోసా, రైతు బోనస్ లాంటి ప్రయోజనాలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. అన్ని సంక్షేమ పథకాలను ప్రజల దాకా చేర్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదని చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్లపై ప్రత్యేక దృష్టి
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికతో పాటు వాటి నిర్మాణాన్ని పూర్తిచేయడంలో నాయకులు బాధ్యత వహించాలని మంత్రి స్పష్టం చేశారు. “ఇళ్లను మంజూరు చేయించడమే కాదు, నిర్మాణం పూర్తయ్యే వరకు పర్యవేక్షణ చేయండి,” అని పిలుపునిచ్చారు.









